పాక్‌లో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. చిన్నారులే అధికం.. బీబీసీ డాక్యుమెంటరీలో షాకింగ్ నిజాలు!

  • పాకిస్థాన్‌లో హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండటంపై వైద్య నిపుణుల ఆందోళన
  • ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై బీబీసీ సంచలన డాక్యుమెంటరీ
  • వాడిన సిరంజీలు, కలుషితమైన మందులతో చిన్నారులకు చికిత్స చేస్తున్న వైనం బట్టబయలు
  • ఒక్క తౌన్సా ప్రాంతంలోనే 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్టు వెల్లడి
  • బీబీసీ వీడియో ఫుటేజ్‌ను ఖండించిన ఆసుపత్రి అధికారులు
పాకిస్థాన్‌లో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిపిల్లలు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కనీస నిబంధనలు పాటించకుండా వాడిన సిరంజీలు, కలుషితమైన మందులతో చికిత్స అందిస్తున్న వైనాన్ని ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ రహస్యంగా చిత్రీకరించిన డాక్యుమెంటరీ బయటపెట్టింది.

బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్ చేపట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో తౌన్సాలోని తహసీల్ హెడ్ క్వార్టర్స్ (టీహెచ్‌క్యూ) ఆసుపత్రిలో నర్సులు, ఇతర సిబ్బంది... పిల్లలకు బట్టల పైనుంచే ఇంజెక్షన్లు ఇవ్వడం, వాడిన సిరంజీలనే మళ్లీ వినియోగించడం, రక్తంతో కలుషితమైన మందుల సీసా నుంచి పలువురు పిల్లలకు మందు ఇవ్వడం వంటి దారుణాలు రికార్డయ్యాయి. సిబ్బంది కొరత, మందుల కొరత కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. 2024 నవంబర్ నుంచి 2025 అక్టోబర్ మధ్య కాలంలో తౌన్సాలోనే కనీసం 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు బీబీసీ తన నివేదికలో పేర్కొంది. గతంలో ఈ ఆసుపత్రిపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపడతామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ఈ డాక్యుమెంటరీ స్పష్టం చేసింది.

మరోవైపు పాకిస్థాన్ వ్యాప్తంగా హెచ్‌ఐవీ కేసుల సంఖ్య పెరగడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 189 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఏప్రిల్ మొదటి 20 రోజుల్లోనే 11 కొత్త కేసులు వచ్చాయని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. బాధితుల్లో పురుషులతో పాటు చిన్నారులు కూడా ఉండటం ఆందోళనను రెట్టింపు చేస్తోంది.

అయితే, ప్రజల్లో అవగాహన పెరిగి పరీక్షల కోసం ముందుకు రావడం వల్లే కేసుల సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోందని ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ మేనేజర్ జుబైర్ అబ్దుల్లా తెలిపారు. ఇక, బీబీసీ విడుదల చేసిన వీడియో ఫుటేజ్‌పై ఆసుపత్రి అధికారులు స్పందిస్తూ ఆ ఆరోపణలను ఖండించారు. తాను బాధ్యతలు చేపట్టక ముందు ఈ ఫుటేజ్ తీసి ఉండవచ్చని లేదా దీన్ని ఎవరో కావాలనే సృష్టించి ఉండవచ్చని ప్రస్తుత మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఖాసిం బుజ్దార్ అన్నారు.

Pakistan
HIV cases
Pakistan Institute of Medical Sciences

More Telugu News